Rajnath Singh: జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు సరిగా లేవు: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
- కడప జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశం
- హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
- ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా
- ఏపీ ప్రగతిలో మోదీ పాత్ర కీలకం అని వెల్లడి
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ ఏపీకి విచ్చేశారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి కూటమి అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, భూపేశ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు సరిగా లేవని విమర్శించారు. కేంద్రం ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడించారు. కానీ ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చి జగన్ అంతటితో చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశం, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతాయని చెప్పారు. ఏపీలో కూటమి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రగతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకం అని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నరసింహారావుకు కూడా భారతరత్న ఇచ్చిన ఘనత మోదీది అని కొనియాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మోదీ సర్కారు లక్ష్యం అని తెలిపారు.
అయోధ్య రామమందిరం అనేది హిందువుల 500 ఏళ్ల కల అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. మోదీ సర్కారు ఆ కల నెరవేర్చిందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు ముస్లిం మహిళలకు గొప్ప ఊరట అని తెలిపారు.