United Nations: పవన్ కల్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం
- ఈ నెల 22న జరిగే ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొననున్న జనసేనాని
- ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ వెళ్లనున్న పవన్ కల్యాణ్
- దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం పవన్‌కు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పవన్ ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తోంది. కాగా, దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కల్యాణ్ దక్కించుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు.