Royal Challengers Bengaluru: అమెరికాలోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ హవా! డిగ్రీ పట్టా అందుకుంటూ ఆర్సీబీ జెండా, జెర్సీతో పోజులు

Video Student Unfurls Royal Challengers Bengaluru Flag At Graduation In US

  • ఇన్ స్టాగ్రా మ్ లో తన గ్రాడ్యుయేషన్ డే వీడియో షేర్ చేసుకున్న యువతి 
  • నిజమైన అభిమానానికి ఓటమి తెలియదంటూ కామెంట్
  • వైరల్ గా మారిన వీడియో.. ఆరు రోజుల్లోనే 40 లక్షల వ్యూస్, 4 లక్షల లైక్ లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముద్దుపేరు ఆర్సీబీ. టీం ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సహా ఎందరో అద్భుతమైన ప్లేయర్లు ఉన్న ఐపీఎల్ జట్టు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విమర్శ ఆ జట్టుపై ఉంది.

కానీ ఈ పరిణామం ఫ్యాన్స్ కు అడ్డంకి కాలేదు. మహేంద్ర సింగ్ ధోనీ ఆడే చెన్నై సూపర్ కింగ్స్ టీం తరహాలోనే ఆర్సీబీకి కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ‘నమ్మ ఆర్సీబీ’ అంటున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్ లను తిలకించే అవకాశం లేకపోయినా తమ జట్టుపై ప్రేమను వినూత్నంగా చాటుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్–డియర్ బార్న్ కాలేజీలో చదువు పూర్తవడంతో ఇద్దరు ఆర్సీబీ ఫ్యాన్స్ తమ గ్రాడ్యుయేషన్ డే వేదికగా ఆర్సీబీ జెండా, జెర్సీని ప్రదర్శించి అందరినీ ఆకర్షించారు. 

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. లిఖిత అనే విద్యార్థి తాను డిగ్రీ పట్టా అందుకొనేటప్పుడు ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించిన వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో ముందు ఓ విద్యార్థి డిగ్రీ పట్టా అందుకొనేందుకు వచ్చి వేదికపై ఉన్న వర్సిటీ డీన్ కాళ్లకు నమస్కరించాడు. అనంతరం పట్టా అందుకొని వేదిక దిగే క్రమంలో తన బ్లేజర్ లోంచి ఆర్సీబీ జెండాను బయటకు తీసి ప్రదర్శించాడు. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన లిఖిత ఆర్సీబీ జెర్సీని ప్రదర్శిస్తూ తెగ సంబరపడింది.

ఈ వీడియోతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ‘క్రికెట్ కు మించి ఆర్సీబీ మాకెంతో నేర్పింది. 15 ఏళ్ల బలమైన బంధం మాది. నేటికీ మేం మా జట్టుతోనే ఉన్నాం. నిజమైన అభిమానానికి ఓటమి తెలియదు’ అంటూ లిఖిత పేర్కొంది. తన జూనియర్లలో ఉన్న ఆర్సీబీ అభిమానులు కూడా దీన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పింది.

ఈ వీడియోను షేర్ చేసిన ఆరు రోజుల వ్యవధిలోనే దీనికి ఏకంగా 40 లక్షల వ్యూస్ లభించాయి. అలాగే దీనికి 4 లక్షల లైక్ లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. 'ఆర్సీబీకి అమెరికా అంబాసిడర్ ఉన్నారు సుమా' అంటూ ఓ యూజర్ స్పందించాడు. మరొకరేమో ‘నువ్వొక రాయల్ క్వీన్’వి అంటూ కితాబునిచ్చాడు. ‘అమెరికా ప్రొఫెసర్లు చూశారా.. భలే ఎంజాయ్ చేస్తున్నారు.. అదే ఇండియాలోని ప్రొఫెసర్లు అయితే ఇలా చేసినందుకు తిట్టిపోసేవారు’ అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

https://www.instagram.com/reel/C6VVSLTAVFS/?utm_source=ig_web_copy_link
  • Loading...

More Telugu News