SRH: చివర్లో ప్యాట్ కమిన్స్ దూకుడు... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి సన్ రైజర్స్ కు బ్యాటింగ్ అప్పగించిన ముంబయి ఇండియన్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసిన సన్ రైజర్స్
- ఆఖర్లో 17 బంతుల్లో 35 పరుగులు చేసిన కమిన్స్
ముంబయి ఇండియన్స్ తో పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చింది. వాంఖెడే స్టేడియం పిచ్ అనూహ్యరీతిలో బౌలర్లకు సహకరించడంతో, సన్ రైజర్స్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.
చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూకుడుగా ఆడి అజేయంగా 35 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. 17 బంతులు ఎదుర్కొన్న కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు.
అంతకుముందు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఓసారి అవుటైనా నోబాల్ కావడంతో బతికిపోయినా హెడ్, మరోసారి తుషార క్యాచ్ వదలడంతో లైఫ్ అందుకున్నాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (11), మయాంక్ అగర్వాల్ (5), హెన్రిచ్ క్లాసెన్ (2), అబ్దుల్ సమద్ (3) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. తెలుగుతేజం నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మార్కో యన్సెన్ 17, షాబాజ్ అహ్మద్ 10 పరుగులు చేశారు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3, లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 3, జస్ప్రీత్ బుమ్రా 1, అన్షుల్ కాంభోజ్ 1 వికెట్ తీశారు.