Job Post: ‘మరాఠీ వాళ్లు అక్కర్లేదు’ అంటూ ఉద్యోగ ప్రకటన.. సోషల్ మీడియాలో దుమారం

Job Post Goes Viral That Says Marathi People Not Welcome
  • గ్రాఫిక్ డిజైనర్ కావాలంటూ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన హెచ్ఆర్
  • మరాఠీ వాళ్లు మాకు అవసరంలేదంటూ నోట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో క్షమాపణలు
నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ కాలంలో ఏ చిన్న నోటిఫికేషన్ విడుదల చేసినా ఊహించనంత స్పందన వస్తోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. అయితే, ముంబైకి చెందిన ఓ కంపెనీకి మాత్రం జాబ్ నోటిఫికేషన్ చిక్కులు తెచ్చిపెట్టింది.. తాము చేయని తప్పుకు క్షమాపణలు కోరాల్సిన పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియా వేదికలపై బహిరంగ ప్రకటన, వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జాబ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న ఓ వాక్యం పెద్ద దుమారానికి కారణమైంది.

అసలు ఏం జరిగిందంటే..
ముంబైలోని ఐటీకోడ్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ కంపెనీ తరఫున జాన్వి సర్న అనే హెచ్ ఆర్ కన్సల్టెంట్ ఈ నోటిఫికేషన్ ను లింక్డ్ ఇన్ లో పోస్టు చేసింది. గ్రాఫిక్ డిజైనర్ కావాలని, అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు, ఆఫర్ చేసే జీతం వివరాలను ఇందులో పేర్కొంది. దీంతో పాటు ‘మరాఠీ వాళ్లు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు‘ అంటూ నోటిఫికేషన్ లో స్పష్టంగా చెప్పింది. ఈ పోస్టు చూసిన వాళ్లు జాన్వి సర్నపై మండిపడ్డారు. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. మరాఠా గడ్డమీద మరాఠీ ప్రజలపైనే వివక్ష చూపించడాన్ని తీవ్రంగా పరిగణించిన జనం.. ఈ నోటిఫికేషన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐటీ కంపెనీ వివరణ..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్ పై ఐటీకోడ్ ఇన్ఫోటెక్ స్పందిస్తూ.. మరాఠా ప్రజలకు క్షమాపణలు తెలిపింది. ఇలాంటి వివక్షాపూరిత ప్రకటనలను తమ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని పేర్కొంది. ఇటీవలి కాలంలో తాము ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఆ జాన్వి సర్న తమ ఉద్యోగి కాదని, తమ కంపెనీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ కంపెనీ పేరును వాడుకుంటూ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిందని జాన్విపై ఆరోపణలు చేసింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వివరణ లేఖను విడుదల చేసింది.

జాన్వి సర్న..
తన పోస్టుపై దుమారం రేగడంతో జాన్వి సర్న కూడా వివరణ ఇచ్చింది. తన పోస్టు వల్ల నొచ్చుకున్న వారికి, మరాఠా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది. తానొక ఫ్రీలాన్స్ రిక్రూటర్ ననీ, వివిధ కంపెనీలకు ఉద్యోగుల నియామక ప్రక్రియలో సేవలు అందిస్తుంటానని చెప్పింది. తాను సేవలందించిన కంపెనీల్లో ఐటీకోడ్ ఇన్ఫోటెక్ ఒకటని వివరించింది. ఆ జాబ్ నోటిఫికేషన్ లో చాలా పొరపాట్లు దొర్లాయని, చూసుకోకుండా పోస్ట్ చేశానని చెప్పింది. ఆ నోటిఫికేషన్ తో ఐటీకోడ్ ఇన్ఫోటెక్ కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది.
Job Post
Marathi People
Discrimination
Mumbai
HR Recruter
Job Notifications

More Telugu News