Google: భారత మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ విడుదల

Google has announced the launch of Google Pixel 8a Smartphone
  • 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 52,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ రేటు రూ. 59,999గా ప్రకటన
  • 14న ఉదయం 6:30 గంటల నుంచి  విక్రయాల ప్రారంభం
  • ఫ్లిప్‌కార్ట్‌‌పై ప్రీ-ఆర్డర్‌కు అవకాశం
చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గూగుల్ పిక్సెల్ 8ఏ’ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో విడుదలయ్యాయి. సరికొత్త డిజైన్, టెన్సార్ జీ3 ఎస్‌వోసీ చిప్‌సెట్‌తో పాటు గతంలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లకే పరిమితమైన ఏఐ ఫీచర్లు వంటి కొత్త హంగులతో ఈ ఫోన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. మే 14, 2024న జరగనున్న గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌కు ఒక వారం రోజుల ముందు గూగుల్ ఈ ప్రకటన చేసింది.

గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు అలోయ్, బే, అబ్సిడియన్, పోర్సీలెయిన్ అనే నాలుగు రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఇక 8జీబీ ర్యామ్, రెండు స్టోరేజీ వేరియెంట్లలో డిజైన్ చేశారు. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 52,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 59,999గా ఉన్నాయి.

మే 14న ఉదయం 6:30 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌పై ప్రీ-ఆర్డర్ అవకాశం ఉంది. రూ.4000 వేల వరకు బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. పిక్సెల్ 8ఏ ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు పిక్సెల్ బడ్స్ ఏ-సిరీస్‌ను కేవలం రూ. 999తో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.

ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. టెన్సార్ జీ3 చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 వంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్‌తో ఫ్లాట్ 6.1-అంగుళాల సూపర్ డిస్‌ప్లే, కెమెరా ముందు భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వెనుకవైపు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక 4,492ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 7.5వాట్స్  వైర్‌లెస్ ఛార్జింగ్‌, 18వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

వైఫై 6, బ్లూటూత్ 5.3, టైప్-సీ యూఎస్‌బీ పోర్ట్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్‌ వంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఒక వర్చువల్ ఈసిమ్ (eSIM) తో పాటు ఒక ఫిజికల్ సిమ్‌ను వాడుకోవచ్చు. కాగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ డిజైన్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. నిజానికి గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు గతేడాదే మార్కెట్లో విడుదలయ్యాయి. చక్కటి ఆదరణ పొంది భారీగా సేల్ అయ్యాయి. దీంతో మరిన్ని అదనపు అప్‌డేటెడ్ ఫీచర్లతో సరికొత్తగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లను విడుదల చేసింది.
Google
Google Pixel 8a
Tech-News
Smart Phones

More Telugu News