TikTok: అమెరికా ప్రభుత్వంపై టిక్‌టాక్ న్యాయపోరాటం!

TikTok Parent company bytedance sues US over potential ban

  • టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ టిక్‌టాక్‌లో తన పెట్టుబడులు వెనక్కు తీసుకోవాలంటూ అమెరికాలో చట్టం
  • ఇందుకు అంగీకరించకపోతే నిషేధం తప్పనిసరి చేసిన వైనం
  • ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్, బైట్ డ్యాన్స్
  • టిక్‌టాక్‌పై నిషేధం అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకమని వాదన
  • పెట్టుబడుల ఉపసంహరణ సాంకేతికంగా, వాణిజ్యపరంగా, చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టీకరణ

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ అమెరికా ప్రభుత్వంపై న్యాయపోరాటానికి దిగింది. బైట్ డ్యాన్స్.. టిక్‌టాక్‌లోని తన పెట్టుబడులు ఉపసంహరించాలంటూ తెచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం అమెరికా రాజ్యాంగంలోని భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని టిక్‌టాక్, బైట్ డ్యాన్స్ పేర్కొన్నాయి. ఈ మేరకు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌కు చెందిన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో కేసు నమోదు చేశాయి. అయితే, ఈ కేసుపై వ్యాఖ్యానించేందుకు అమెరికా న్యాయశాఖ నిరాకరించింది. 

టిక్‌టాక్‌లో పెట్టుబడుల ఉపసంహరణను తప్పనిసరి చేస్తూ అమెరికా చట్టసభలు ఓ చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 19 లోపు బైట్‌డ్యాన్స్ టిక్‌టాక్ నుంచి వైదొలగాలి. లేని పక్షంలో ఈ యాప్‌ను అమెరికాలో నిషేధించనున్నారు. చైనా యాజమాన్యం చేతుల్లో టిక్‌టాక్ ఉండటం అమెరికా భద్రతకు ప్రమాదకరమని అక్కడి ప్రభుత్వం, చట్టసభ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అమెరికా ప్రజల డేటాను చైనా తమ దేశానికి తరలించుకుపోవచ్చని, అమెరికా పౌరులపై నిఘా పెట్టొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికా పౌరుల డేటాను తామెన్నడూ దేశ సరిహద్దులను దాటనీయమని టిక్‌టాక్ పదే పదే స్పష్టం చేస్తోంది. ఉహాజనిత ఆరోపణలు, అనవసర భయాలతో అమెరికా చట్టసభ సభ్యులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. ‘‘చరిత్రలో తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ (ఎగువ, దిగువ సభలు) ఓ వాక్ స్వాతంత్ర్య వేదికపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించేందుకు సిద్ధమైంది’’ అని బైట్‌డ్యాన్స్ తన కేసులో ఆరోపించింది. వాణిజ్యపరంగా, సాంకేతికంగా, చట్టపరంగా పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. బైట్ డ్యాన్స్‌లో 58 శాతం వాటా..బ్లాక్ రాక్, జనరల్ అట్లాంటిక్, సస్క్యూహేనా ఇంటర్నేషనల్ గ్రప్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల చేతుల్లో, 21 శాతం ఉద్యోగులు చేతుల్లో( 7 వేల మంది అమెరికన్లు సహా), 21 శాతం తమ వద్ద ఉందని బైట్ డ్యాన్స్ కోర్టుకు వెల్లడించింది. 

ఇంటర్నెట్, సాంకేతికత కోసం ఆధిపత్య పోరు!
ఇంటర్నెట్, సాంకేతిక రంగాలపై ఆధిపత్యం కోసం చైనా, అమెరికాలు పోటీపడుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పోరాటానికి మరో వేదికగా టిక్‌టాక్ మారిందని అంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్ వినియోగిస్తున్నారు. మరోవైపు, చైనా గతేడాది వాట్సాప్, థ్రెడ్స్ యాప్‌లను యాప్ స్టోర్‌ నుంచి తొలగించాలని యాపిల్‌ సంస్థను ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా వాటిని తొలగించాలని పేర్కొంది. ఇక టిక్‌టాక్ అమ్మకానికి అమెరికా, చైనా అంగీకరించినా, దీన్ని కొనేస్థాయి ఎవరికైనా ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టిక్‌టాక్ సోర్సు కోడ్ మొత్తాన్ని అమెరికా తరలించేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కొన్నేళ్లు పడుతుందని కూడా టిక్‌టాక్ తన కేసులో కోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News