Summer: భూమిపై అత్యధిక వేడిమి నెలగా ఏప్రిల్ 2024

April 2024 warmest ever on record as temperature says European climate agency

  • ఏప్రిల్ 2024లో భూమిపై సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు
  • 1850-1900 మధ్య కాలం సగటుతో పోల్చితే 1.58 డిగ్రీలు అధికం
  • మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణమన్న యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ రిపోర్ట్

ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక రిపోర్టును విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదల విలయాలు అనేక దేశాలలో రోజువారీ జీవితానికి ఆటంకాలు ఏర్పరచాయని పేర్కొంది. వరుసగా పదకొండవ నెల ఏప్రిల్‌లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందని ప్రస్తావించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గి, మనుషుల ప్రేరిత వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయని రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.

పారిశ్రామికీకరణకు ముందునాటి కాలం 1850-1900తో పోల్చితే ఏప్రిల్‌ 2024లో ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 15.03 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని, గణనీయంగా 1.58 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలను ఇది సూచిస్తోందని పేర్కొంది. ఇక  ఏప్రిల్ 1991-2020 సగటుతో పోల్చితే 0.67 డిగ్రీల సెల్సియస్ అధికమని ఆందోళన వ్యక్తం చేసింది.

ఎల్‌నినో వంటి ప్రకృతి చర్యలతో ముడిపడి ఉన్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగడం, తగ్గడం సాధారణమేనని  ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకుందని, అయితే తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం తటస్థ స్థితికి చేరుతున్నాయని పేర్కొన్నారు. అయితే గ్రీన్‌హౌస్ వాయువుల పరిణామం పెరుగుతుండడంతో సముద్రంలో, వాతావరణంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News