T20 World Cup 2024: ఈ ఐదుగురు ప్లేయర్లు ఐపీఎల్లో స్టార్స్.. జీతం రూ.10 కోట్లపైనే.. అయినా ప్రపంచకప్‌లో దక్కని చోటు
- కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, శ్రేయస్ అయ్యర్‌లకు పొట్టి ప్రపంచకప్‌లో నో ప్లేస్
- ఎల్ఎస్జీకి ఆడుతున్న రాహుల్‌కు రూ. 17 కోట్లు చెల్లిస్తున్న ఫ్రాంచైజీ
- కేకేఆర్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్‌కు రూ.12.25 కోట్ల శాలరీ
- ఎంఐ ఫ్రాంచైజీ నుంచి జీతం రూపంలో ఏకంగా రూ.15.25 కోట్లు అందుకుంటున్న ఇషాన్ కిషన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్టార్ ప్లేయర్లుగా ఉన్న ఐదుగురు భారత ఆటగాళ్లు ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారి జీతం కూడా రూ.10 కోట్లకు పైగానే ఉండడం గమనార్హం. ఇలా స్టార్ ఆటగాళ్లుగా ఉంటూ, ఐపీఎల్లో భారీ మొత్తం ఆర్జిస్తూ టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించలేకపోయిన ఆ ఐదుగురు ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆ ఐదుగురు ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, శ్రేయస్ అయ్యర్. వీరందరీ ఐపీఎల్ శాలరీ రూ. 10 కోట్లకు పైనే. అయినా ఈసారి పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యారు.
కేఎల్ రాహుల్: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కి ఆడుతున్నాడు. పైగా ఆ జట్టుకు సారధి కూడా. దీంతో లక్నో ఫ్రాంచైజీ రాహుల్‌కు భారీగానే చెల్లిస్తోంది. ఎల్ఎస్జీ నుంచి అతడు రూ.17 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ఈ స్టార్ ప్లేయర్ 2022 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
శ్రేయస్ అయ్యర్: కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కూడా ప్రాంఛైజీ నుంచి భారీగానే అందుకుంటున్నాడు. అతనికి కోల్‌కతా యాజమాన్యం ఏకంగా రూ.12.25 కోట్ల శాలరీ చెల్లిస్తుంది. 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌లలో రిజర్వ్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న శ్రేయస్‌కు ఈసారి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ కూడా ఆడాడు.
ఇషాన్ కిషన్: ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ బ్యాటర్, వికెట్ కీపర్‌కు కూడా జీతం భారీగానే అందుతోంది. ఎంఐ ఫ్రాంచైజీ నుంచి జీతం రూపంలో ఏకంగా రూ.15.25 కోట్లు అందుకుంటున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ టీమిండియా తరఫున 2021 టీ20 వరల్డ్‌కప్ ఆడాడు. గత సంవత్సరం ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ సభ్యుడు. కానీ, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం సెలక్టర్లు కిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
హర్షల్ పటేల్: ఈ స్టార్ పేసర్‌ను గతేడాది దుబాయి వేదికగా జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ.11.75 కోట్లకు దక్కించుకుంది. హర్షల్ పటేల్ భారత్ తరఫున టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అంతెందుకు, 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడాడు. అయితే, మధ్యలో ఫామ్‌లేమికి తోడు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దాంతో ఈసారి వరల్డ్‌కప్‌లో స్థానంలో కోల్పోయాడు.
దీపక్ చాహర్: ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దీపక్ చాహర్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఆ జట్టులో అధిక జీతం పొందుతున్న వారిలో ఈ స్టార్ మీడియం పేసర్ కూడా ఒకడు. నిలకడలేని బౌలింగ్, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వంటి కారణాలతో గత కొంతకాలంగా టీమిండియాకు దూరమయ్యాడు. దాంతో ఈ పొట్టి ప్రపంచకప్‌లో కూడా చోటు దక్కలేదు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
ఇక జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి 20 జట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న దాయాది పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, 15న కెనడాతో భారత్ తలపడనుంది.