Chandrababu: జీవితంలో కొందరు వ్యక్తులు ఊహకు అందరు... ఇతడు కూడా అలాంటివాడే: చంద్రబాబు
- ఏబీఎన్ చానల్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
- ఏబీఎన్ రాధాకృష్ణతో ఆలోచనలు పంచుకున్న టీడీపీ అధినేత
- జగన్ ను తక్కువ అంచనా వేశామని వెల్లడి
- జగన్ ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమేనని వ్యాఖ్యలు
- జగన్ ఈసారి గెలిచే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏబీఎన్ చానల్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ అధినేత రాధాకృష్ణతో తన ఆలోచనలను చంద్రబాబు పంచుకున్నారు. జగన్ గెలిచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ వస్తాడన్న నమ్మకం లేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ఉద్ఘాటించారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, చాలా రాజకీయ పార్టీలను, అనేకమంది సీఎంలను చూశానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు.
జగన్ ను తాము తక్కువ అంచనా వేశామని చెప్పారు. జగన్ ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు. జీవితంలో కొందరు వ్యక్తులు ఊహకు అందరని, ఇలాంటి వ్యక్తి పుడతాడని ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. జగన్ ను తండ్రి ఎందుకు బెంగళూరు పంపించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
దేశంలో ఏ పార్టీ కూడా మీడియా సంస్థలు పెట్టలేదని, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికే పేపర్ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేశారని వెల్లడించారు.
రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యం పెరిగిపోయాయని, రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని, పరిశ్రమలను నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసమే మూడు పార్టీలు కలిశాయని, రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం తమకుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో తమకు అప్పటి ప్రధాని వాజ్ పేయి కూడా సహకరించారని చంద్రబాబు తెలిపారు. పాలసీల్లో మోదీ కచ్చితంగా సహకరిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.
గతంలో ఒక ఇష్యూపై మోదీతో విభేదించానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న విషయంలో ఆందోళన కలిగిందని చెప్పారు. ఇక, రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం కలిగిందని పేర్కొన్నారు.
మోదీపై దేశ ప్రజలకు నమ్మకం ఉందని, ప్రపంచంలోనే నాయకత్వ లేమి ఉన్న సమయంలో మోదీ నాయకుడిగా ఎదిగారని, మన దేశాన్ని ప్రమోట్ చేశారని చంద్రబాబు వివరించారు. నాడు రాష్ట్రం కోసమే ఎన్టీఆర్ కేంద్రంలో చేరలేదని, తెలుగుజాతే ముఖ్యమని ఎన్టీఆర్ భావించారని వెల్లడించారు. 2014లో తాను కూడా కేంద్రంలో పదవులు అడగలేదని తెలిపారు.
జగన్ కాళ్లు మొక్కి కేసులు మాఫీ చేయించుకుంటాడని ఆరోపించారు. జగన్ మాటల్లో అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తోందని, గతంలో తనను ఎవరూ టచ్ చేయలేరని అన్నాడని, ఇప్పుడేమో తనను ఓడించడానికి అందరూ కలిశారంటున్నాడని విమర్శించారు.
ఉద్యోగులకు గతంలో ముఖ్యమంత్రులే భయపడిన సందర్భాలు ఉన్నాయని, కానీ జగన్ పాలనలో ఉద్యోగులు కూడా భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ఈసారి గెలిస్తే రివర్స్ పీఆర్సీ అంటాడని విమర్శించారు.