KCR: హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే... ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది: కేసీఆర్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెల్లలో రాష్ట్రం ఆగమైందన్న కేసీఆర్
- ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్న కేసీఆర్
- మల్లన్నసాగర్ నుంచి నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్న మాజీ సీఎం
కరెంట్ కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రం ఆగమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అందర్నీ వంచించిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్నారు. రైతుబంధు అందరికీ పడలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదన్నారు.
వరికి బోనస్ బోగస్ అయిందని విమర్శించారు. కరెంట్ కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. నర్సాపూర్ ప్రాంతానికి మంచి నీళ్లు రావాలని కోమటిబండ నుంచి ప్రత్యేక లైన్ వేయించానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్సాపూర్ లింక్ అయి లక్షా యాభై వేల ఎకరాలకు నీరు రావాలని శంకరంపేట వద్ద కాల్వలు కూడా తవ్వుతున్నారని తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు రావడం ప్రారంభమైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు.
కాంగ్రెస్ ఈ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం తనకు లేదని, ఆ కాల్వ పూర్తై మల్లన్నసాగర్ నుంచి నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. రైతు బంధు వ్యవసాయం చేసినవారికి, పొలం దున్నినవాళ్లకే ఇస్తారట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్‌ను కేసీఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారో అందరికీ తెలుసునన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెడుతోందని... తొండి పెడుతోందని విమర్శించారు.