Khalistan: ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్రలో భారత్ పై నమ్మదగిన ఆధారాల్లేవు: రష్యా
- భారత్ పై ఎటువంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయిందన్న రష్యా విదేశాంగ మంత్రి మారియా జఖరోవా
- అమెరికా వ్యాఖ్యలు నయా వలసవాద విధాన మనస్తత్వానికి అద్దంపడుతున్నాయని వ్యాఖ్య
- భారత్ పై అమెరికా వ్యాఖ్యలు కేవలం నిరాధారం..ఊహాజనితమన్న జఖరోవా
ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై రష్యా మండిపడింది. పన్నున్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై నమ్మదగిన ఆధారాలేవీ లేవని రష్యా తెలిపింది. పన్నున్ హత్య కేసుకు సంబంధించి భారత్ ప్రమేయంపై అమెరికా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయిందని రష్యా విదేశాంగ మంత్రి మారియా జఖరోవా వ్యాఖ్యానించారు. భారత్ ను ఒక దేశంగా గౌరవించకలేకపోతున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ...అమెరికా వ్యాఖ్యలు నయా వలస విధాన మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని చెప్పారు.
రష్యా, సౌదీ అరేబియా విధానాలను భారత్ అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ విలేకరి అడిగి ప్రశ్నకు మారియా జఖరోవా సమాధానమిచ్చారు. ఖలిస్థాన్ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ ను హత మార్చేందుకు భారత్ కు చెందిన వ్యక్తుల ప్రమేయంపై ఇప్పటికీ అమెరికా ఎటువంటి నమ్మదగిన ఆధారాలను చూపలేకపోయిందని జఖరోవా తెలిపారు. ఈ విషయంపై అమెరికా చేస్తున్న ఊహాజనిత, నిరాధార ఆరోపణలు ఆమోదయోగ్యం కాదని జఖరోవా స్పష్టం చేశారు.
అమెరికా ఇటువంటి ఆరోపణలు చేయడం సాధారణమేనని, భారత్ పైనే కాక గతంలోనూ అనేక దేశాలపై ఇటువంటి ఆరోపణలు చేసిందని ఆమె గుర్తు చేశారు. మతపరమైన స్వేచ్ఛను భారత్ ఉల్లంఘించిందని, భారత్ ను ఒక దేశంగా గౌరవించలేకపోతున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలు ఆ దేశ నయా వలసవాద విధాన మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని జఖరోవా వ్యాఖ్యానించారు. నయా వలసవాద విధానంలో బానిసల వ్యాపారం, సామ్రాజ్యవాదం ఉంటాయని ఆమె తెలిపారు.
ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను సంక్లిష్టం చేసేందుకు, భారత అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకే అమెరికా ఇటువంటి దిగజారుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఇతర దేశాల్లో అణచివేతలుకొనసాగుతున్నాయని సుద్దులు చేప్పే అమెరికా ఆ దేశ అణచివేత పాలనను ఊహించడమే కష్టంగా ఉందని ఖజరోవా తెలిపారు.
పన్నున్ కేసులో అసలు ఏం జరుగుతోంది?
ఖలీస్థాన్ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ ను హత మార్చేందుకు భారత్ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిని భారత విదేశీ వ్యవహారాల మంత్రి రణ్ ధీర్ జైశ్వాల్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీకి చెందిన పరిశోధన బృందం అమెరికా చేస్తున్న ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్న సమయంలో వాషింగ్టన్ పోస్ట్ ఈ విధమైన నిరాధార, ఊహాజనిత కథనాలు వండి వార్చడం సమర్థనీయం కాదని, ఇటువంటి చర్యల వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదని జైశ్వాల్ తెలిపారు.