Chandrababu: భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని నిలబెట్టాలి: చంద్రబాబు
- శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు సిగ్గుచేటన్న చంద్రబాబు
- దక్షిణాది వారికి ప్రత్యేక సంస్కృతి, గుర్తింపు ఉన్నాయని వెల్లడి
- వివిధ రాష్ట్రాలకు చెందినవారిమైనా మనమంతా భారతీయులమేనని పునరుద్ఘాటన
భారత్ లో తూర్పు ప్రాంతం వారు చూడ్డానికి చైనా వారిలా, దక్షిణాది వారు ఆఫ్రికా వారిలా ఉంటారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. భారత రాజకీయాలలో ఉన్న వారు, వాటిని ప్రభావితం చేసేవారంతా భారత దేశ అంత:సూత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. దక్షిణాది వారికి ఓ ప్రత్యేకమైన సంస్కృతి, గుర్తింపు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆఫ్రికా వారికి కూడా తమదైన సొంత గుర్తింపు ఉందని చెప్పారు.
మనం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు చెందినవారమైనప్పటికీ ముందు మనమంతా భారతీయులమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వ్యక్తుల గుర్తింపును వారి వేషధారణ, రూపం, చర్మపు రంగు వంటి వాటితో కుదించి పోల్చడం నిజంగా సిగ్గు చేటని విమర్శించారు. ఇటువంటి తిరోగమన, జాత్యహంకార వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, శ్యామ్ పిట్రోడా చేసిన విభజన వాద, జాత్యహంకార వ్యాఖ్యలకు నాగరిక సమాజంలో తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు.