Chandrababu: రాష్ట్రంలో సైకో పాలన పోవాలి.. వైసీపీకి ఓటు వేస్తే మీకు మీరు ఉరి వేసుకున్నట్లే.. ఉండిలో ప్రజాగళం సభలో చంద్రబాబు
- రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో, అహంకారి, దోపిడిదారి అన్న టీడీపీ అధినేత
- మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ వ్యాఖ్య
- మరోసారి జగన్‌ను గెలిపిస్తే, మీ ప్రతీ ఇంటికి గొడ్ఢలి వస్తుంద్న చంద్రబాబు
- టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ
ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని అన్నారు. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో, అహంకారి, దోపిడీదారు అని తెలిపారు.
ప్రశ్నించినందుకు ఎంపీ రఘురామ కృష్ణరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు. రఘురామకు న్యాయం చేయడం కోసమే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామన్నారు. ఆర్ఆర్ఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.
మరోసారి జగన్‌ను గెలిపిస్తే, మీ ప్రతీ ఇంటికి గొడ్ఢలి వస్తుంది.. గొడ్డలి పోటు మీకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం పేరుతో కోట్లు దోచేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరగని కుంభకోణం అంటూ లేదని మండిపడ్డారు. మీ భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశాడని, పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ధ్వజమెత్తారు. మీ భూములు మీవి కావు.. జగన్‌వి.. వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడంటూ ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందన్నారు.
ఒకవేళ ఫ్యాన్‌ను మళ్ళీ తీసుకు వస్తే, మీకు ఉరి వేస్తాడని టీడీపీ అధినేత అన్నారు. అది మీకు అవసరమా..? అని ప్రశ్నించారు. అందుకే మీరు వైసీపీకి ఉరి వేయాలి.. ఫ్యాన్‌కు ఉరి వెయ్యాలన్నారు. పచ్చి మోసగాడు ఈ జలగ జగన్ అని ఘాటు విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం, సీపీయస్ రద్దు చేస్తానన్నాడని, కానీ చేయలేదంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 30 లక్షల ఇళ్లు కడతానని చెప్పిన రంగుల పిచ్చోడు.. ఆ ఇళ్లు కట్టించాడా? అని ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. గంజాయిని వంద రోజుల్లోనే అణచివేస్తామన్నారు. అందరికీ మంచినీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జలజీవన్ స్రవంతిని తీసుకు వచ్చామన్నారు. కానీ, దానిలోనూ జగన్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్‌కు రూ. 1.50కే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ దుయ్యబట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలని, వైసీపీకి ఓటు వేస్తే, మీకు మీరు ఉరి వేసుకున్నట్లే చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.