YS Sharmila: వైఎస్సార్టీపీ స్థాపించడానికి కారణం బయటపెట్టిన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్
- ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు ఇంటికి వచ్చి కోరడంతో షర్మిల నిర్ణయించుకున్నారని వెల్లడి
- తొలుత తిరస్కరించినా.. రెండోసారి పార్టీ స్థాపనకు అడుగువేశారని వివరణ
- సొంత అన్నపై పోరాడడం ఇష్టంలేక తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారన్న అనిల్ కుమార్
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించి వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన నేపథ్యాన్ని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ వెల్లడించారు. షర్మిల గతంలోనూ రాజకీయాల్లో ఉన్నారని, వైఎస్ జగన్ కోసం 3,200 కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేశారని, అయితే ఆ సమయంలో పార్టీ పెట్టే ఆలోచన ఆమెకు లేదని వెల్లడించారు. 2020లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బెంగళూరులోని తమ ఇంటికి వచ్చి షర్మిలను కలిశారని, తెలంగాణకు వచ్చి కచ్చితంగా పని చేయాలని సూచించారని వెల్లడించారు. ‘తెలంగాణ వాళ్లు బాధపడొద్దు.. నా చెల్లెల్ని పంపిస్తానని గతంలో జగన్ అన్నారు’ అంటూ ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారని వివరించారు. అయితే వెళ్లి అన్నని అడగండి అని షర్మిల సమాధానం ఇచ్చారని చెప్పారు.
‘‘ ప్రశాంత్ కిశోర్ వెళ్లి జగన్‌ను అడిగితే నో నో.. పార్టీ పెట్టొద్దని చెప్పారట. తెలంగాణలో కేసీఆర్, మేమూ పార్టనర్స్ అయ్యాం అని అన్నారట. ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని కేసీఆర్ ఇబ్బంది పెడతాడని జగన్ చెప్పారట. అక్కడితో షర్మిల కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత జగన్, షర్మిల మధ్య చాలా విభేదాలు మొదలయ్యాయి. షర్మిలను నిర్లక్ష్యం చేయడం జగన్ మొదలుపెట్టారు. అదే సమయంలో పార్టీ పెట్టొచ్చు కదా అని చాలామంది షర్మిలను అడిగారంట. అయితే ఒక రోజు షర్మిల ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నారు. నేను తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటే ఏదైనా ఒక సంకేతం ఇవ్వండి దేవుడా అని ప్రార్థించారు’’
‘‘సుమారు రెండు నెలల తర్వాత ప్రశాంత్ కిశోరే మళ్లీ మా ఇంటికి వచ్చారు. ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు. మీరు తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని షర్మిలతో చెప్పారు. ఆ సమయంలో కూడా మా అన్న వద్దన్నాడు కదా తెలంగాణ రాజకీయాల్లోకి రాను అని షర్మిల చెప్పారు. కానీ మీరు కచ్చితంగా ఈ సమయంలో తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే ఎలా అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని షర్మిల అప్పుడే నిర్ణయించుకున్నారు. సొంత అన్నయ్యపై పోరాడడం ఇష్టం లేకనే ఆమె తెలంగాణను ఎంచుకున్నారు’’ అని బ్రదర్ అనిల్ కుమార్ వివరించారు. ఒక ప్రముఖ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు.
ఇక వైఎస్సార్టీపీ ద్వారా తెలంగాణలో మంచి నాయకులను తయారు చేయాలనే అజెండాతో షర్మిల పనిచేశారని, మంచి పాలన తీసుకురావాలని ఆమె కోరుకున్నారని బ్రదర్ అనిల్ చెప్పారు. కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదని, పోటీ చేస్తే కేసీఆర్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వెనక్కి తగ్గారని వివరించారు. వైఎస్సార్టీపీని నమ్ముకున్నవారిని ఎవరినీ వదిలివేయలేదని, నాయకులకు మంచి స్థానం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానంతో విలీన సమయంలో షర్మిల మాట్లాడారని వెల్లడించారు. అయితే రాజకీయ నాయకులు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి మంచి నాయకులు కావాలన్నారు. రాజకీయ నాయకులు స్వలాభం కోసం పనిచేస్తారని, అయితే నాయకుడు తమదైన ముద్రవేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిలను రాజకీయాల్లోకి పంపిస్తానని దేవుడు చెప్పారని పేర్కొన్నారు. ఏ సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఆయా రంగాల్లో రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.