IPL 2024: చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్షిష్టం చేసిన గుజరాత్
- గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
- తొలి వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన గిల్, సాయిసుదర్శన్
- పరుగుల వేటలో చతికిల పడిన చెన్నై
- ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా శుభమన్ గిల్
ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. గత రాత్రి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌లో తడాఖా చూపించిన గుజరాత్.. తర్వాత బౌలింగ్‌లోనూ అదే జోరు కొనసాగించి చెన్నై వికెట్లను గిరాటేసి 35 పరుగులతో విజయం సాధించింది.
గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. పది పరుగులకే ఓపెన్లు అజింక్యరహానే (1), రచిన్ రవీంద్ర (1) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును డరిల్ మిచెల్ (63), మొయిన్ అలీ (56) అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వారు క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో ఓటమి తప్పలేదు.
మోహిత్‌శర్మ వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి చెన్నైని దారుణంగా దెబ్బతీశాడు. రషీద్‌ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్, సందీప్ వారియర్ చెరో వికెట్ తీసుకున్నారు. 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఆరో ఓటమి కాగా, ప్లే ఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైన గుజరాత్‌కు ఇది ఐదో గెలుపు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉతుకుడుతో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసింది. సెంచరీలతో చెలరేగిన ఈ జంట తొలి వికెట్‌కు 210 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. గతంలో క్వింటన్ డీకాక్- కేఎల్ రాహుల్ సాధించిన 210 పరుగుల రికార్డును ఈ జోడీ సమం చేసింది. సాయి సుదర్శన 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శుభమన్‌గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది వందో సెంచరీ కావడం విశేషం.