Wasim Akram: రిటైర్ అయ్యాక పార్టీలు చేసుకో.. ఐపీఎల్ స్టార్‌కు వసీం అక్రమ్ స్ట్రాంగ్ వార్నింగ్
- టీంలో చోటులేక ఇబ్బందుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వి షా
- మైదానం ఆవల కాంట్రవర్సీలతో ఇక్కట్లపాలు
- పృథ్వి ఆటపైనే దృష్టి పెట్టాలన్న పాక్ లెజెండ్ వసీం ఆక్రమ్
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో భారీ స్కోర్లు సాధించి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని సూచన
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షాపై క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు భారీ అంచనాలే ఉండేవి. కానీ, క్రమశిక్షణ లేమితో పృథ్వీ అవస్థలు పడుతున్నాడు. మైదానం ఆవల అనేక కాంట్రవర్సీలతో పతాకశీర్షికల్లో నిలుస్తున్న పృథ్వి ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ పృథ్వికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పార్టీలను కట్టిపెట్టి ఆటపై దృష్టిపెట్టాలన్నాడు.
‘‘ఈ ఏడాది నేను అతడిని అంతగా గమనించలేదు కానీ అతడు మళ్లీ క్రికెట్ మూల సూత్రాలపై దృష్టిపెట్టాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి గొప్ప స్కోర్లు సాధించాలి. పార్టీలపై కాక ఆటపై దృష్టి పెట్టాలి. అతడిలో ఇంకా బోలెడంత క్రికెట్ మిగిలే ఉంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి సెంచరీలు సాధించి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి. అతడికి ఇదొక్కటే మార్గం. షార్ట్ కట్‌లు ఏమీ లేవు. పృథ్వికి ఇంకా సమయం మిగిలి ఉండటం కలిసొచ్చే అంశం. పృథ్వి రెగ్యులర్‌గా ఆడాలి. మైదానం ఆవల కూడా తనపై తాను దృష్టి పెట్టాలి. రిటైర్ అయ్యాక కావాల్సినన్ని పార్టీలు చేసుకోవచ్చు. ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం కేవలం క్రికెట్‌పై దృష్టి పెట్టాలి’’ అని వసీం సూచించాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిట్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచేందుకు శ్రమిస్తోంది. చివరి రెండు మ్యాచుల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడుతోంది.