IPL 2024: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్!
- ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 14 శతకాల నమోదు
- మరే ఐపీఎల్ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదుకాని వైనం
- నిన్నటి మ్యాచులో గిల్ కొట్టిన శతకం ఐపీఎల్లో 100వ సెంచరీ
- 2023 ఐపీఎల్ సీజన్లో 12 సెంచరీలు
- 2022 ఐపీఎల్లో ఎనిమిది శతకాలు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 14 శతకాలు నమోదయ్యాయి. మరే సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాకపోవడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు బాదడంతో ఈసారి శతకాల సంఖ్య 14కు చేరింది. కాగా, నిన్నటి మ్యాచులో గిల్ కొట్టిన శతకం ఐపీఎల్లో 100వ సెంచరీ కావడం విశేషం.
ఇక ఈసారి నమోదైన ఈ 14 శతకాలలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జాస్ బట్లర్ 2, సునీల్ నరైన్ (కేకేఆర్), మార్కస్ స్టోయినిస్ (ఎల్ఎస్జీ), విల్ జాక్స్ (ఆర్సీబీ), రోహిత్ శర్మ (ఎంఐ), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), ట్రావిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్), జానీ బెయిర్‌స్టో (పీబీకేఎస్), రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే), శుభ్‌మన్ గిల్ (జీటీ), సాయి సుదర్శన్ (జీటీ), యశస్వి జైస్వాల్ (ఆర్ఆర్) చెరో సెంచరీ కొట్టారు.
2023 ఐపీఎల్ సీజన్లో 12 సెంచరీలు
కాగా, 2023 ఐపీఎల్ సీజన్లో మొత్తం 12 శతకాలు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒక ఎడిషన్‌లో 10కి పైగా సెంచరీలు వచ్చాయి. గత సీజన్లో తొమ్మిది మంది బ్యాటర్లు సెంచరీలు బాదారు. ఆరెంజ్ క్యాప్ గెలిచిన గిల్ ఏకంగా మూడు శతకాలు నమోదు చేయడం విశేషం. అలాగే విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు నమోదు చేశాడు.
ఈ సీజన్లో సెంచరీలు చేసిన ఇతర బ్యాటర్లు: జైస్వాల్ (ఆర్ఆర్), సూర్యకుమార్ (ఎంఐ), కామెరాన్ గ్రీన్ (ఎంఐ), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), వెంకటేష్ అయ్యర్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పీబీకేఎస్), హ్యారీ బ్రూక్ (ఎస్ఆర్హెచ్).
2022 ఐపీఎల్లో 8 సెంచరీలు
2022 సీజన్లో 8 శతకాలు నమోదు కాగా, జాస్ బట్లర్ ఒక్కడే నాలుగు సెంచరీలు కొట్టడం విశేషం. అలాగే నాలుగు అర్ధసెంచరీలు కూడా చేశాడు. ఈ సీజన్లో 17 మ్యాచుల్లో బట్లర్ 57.53 సగటుతో ఏకంగా 863 పరుగులు చేశాడు. ఇక ఎల్ఎస్జీ ఆటగాడు కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు చేశాడు. అతను ఈ ఐపీఎల్ లో 51.33 సగటుతో 616 పరుగులు బాదాడు. అలాగే రజత్ పాటిదార్ (ఆర్సీబీ), క్వింటన్ డి కాక్ (ఎల్ఎస్జీ) ఒక్కో శతకాలు కొట్టారు.
ఐపీఎల్ 2016 సీజన్లో 7 సెంచరీలు నమోదు
ఐపీఎల్ 2016 సీజన్లో విరాట్ కోహ్లీదే ఆధిపత్యం. ఆ సీజన్లో 81.08 సగటులో ఏకంగా 973 పరుగులు నమోదు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. మరో ముగ్గురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ కొట్టారు. వారే.. స్టీవ్ స్మిత్ (ఆర్పీఎస్), క్వింటన్ డి కాక్ (డీసీ), ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ). అలాగే 2008, 2011, 2012, 2019 సీజన్లలో ఆరు చొప్పున సెంచరీలు నమోదయ్యాయి.