Amit Shah: సర్జికల్ స్ట్రయిక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు: అమిత్ షా
- వికారాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- సర్జికల్ స్ట్రయిక్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని మండిపాటు
- కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చిందని ఆరోపణ
- బీజేపీ ఉన్నంతవరకు పీఓకే పాక్ వశం కాదని స్పష్టీకరణ
- తన వీడియోను మార్ఫింగ్ చేసి రేవంత్ చాలా పెద్ద తప్పు చేశాడన్న అమిత్ షా
వికారాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రయిక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చిందని ఆరోపించారు. పీఓకే భారత్ అధీనంలోనే ఉంటుందని, బీజేపీ ఉన్నంతవరకు ఈ ప్రాంతం పాక్ వశం కాదని స్పష్టం చేశారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని పేర్కొన్నారు.
అలాగే ఇదే సభలో మరోసారి తెలంగాణలో వైరల్‌గా మారిన తన ఫేక్ వీడియోపై కూడా అమిత్ షా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తప్పు చేశారని అన్నారు. తన 'వీడియోను మార్ఫింగ్ చేసి చాలా పెద్ద తప్పు చేసావ్ రేవంత్' అని అమిత్ షా అన్నారు. తన వీడియోను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఎడిట్ చేసి, వైరల్ చేసిందని ఆయన ఆరోపించారు.