Revanth Reddy: ఈ సారి ఓటు రాజ్యాంగ రక్షణ.. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం వేద్దాం: రేవంత్ రెడ్డి
- ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్
- ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం
- రాజ్యాంగాన్ని మార్చే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉందని ఆరోపణ
- ఈసారి 400 ఎంపీ సీట్లు గెలవడం ద్వారా ఈ పని చేయబోతుందన్న రేవంత్
- ఒకవేళ అదే జరిగితే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు ఉండవని వ్యాఖ్య
మరో రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉందన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవడం ద్వారా ఈ పని చేయబోతుందని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు ఉండవన్నారు.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్లు మాయమవుతాయని తెలిపారు. రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడమే బీజేపీ లక్ష్యం అని రేవంత్ అన్నారు. ఇవి జరగకుండా ఉండాలంటే ఈసారి ఓటు రాజ్యాంగ రక్షణ కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం వేద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధికి ఓటేద్దాం.. అరాచకాన్ని పాతరేద్దామని సీఎం తెలిపారు. అందుకే తెలంగాణలోని 4 కోట్ల జనం ఆలోచించి ఓటు వేయాలన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.