Hyderabad: ఓట్ల పండుగ... ఖాళీ అవుతున్న భాగ్యనగరం... కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
- ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల నుంచి వందలాది ప్రత్యేక బస్సులు
- 2000 ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ
- ఏపీ, తెలంగాణలోని తమ తమ గ్రామాలకు వెళుతున్న ఓటర్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి ఓట్ల పండగ ఉంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరం ఖాళీ అవుతోంది. హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉంటారు. వారంతా ఇప్పుడు తమ తమ గ్రామాల్లో ఓటు వేసేందుకు ఇంటి బాట పట్టారు. దీంతో ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి. బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి దాదాపు 2000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ ప్రాంతాల నుంచి 300 బస్సుల చొప్పున నడుపుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీ రష్ కనిపిస్తోంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని వివిధ జిల్లాలకు వెళుతున్న బస్సులు, రైళ్లు ఫుల్ అయ్యాయి. చాలామంది సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరారు. రైల్వే శాఖ రేపు, ఎల్లుండి సికింద్రాబాద్-విశాఖ మధ్య రైలు నడుపుతోంది.