Kona Venkat: టీడీపీలో చేరాడని.. దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి.. ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ
- టీడీపీలో చేరిన గణపవరం వైసీపీ ఎస్సీ నాయకుడు కత్తి రాజేశ్
- తమ వద్ద రూ. 8 లక్షలు తీసుకుని టీడీపీలో చేరాడంటూ రాజేశ్‌పై వైసీపీ నేతల ఫిర్యాదు
- పోలీస్ స్టేషన్‌లో రాజేశ్‌పై కోన వెంకట్ దాడి చేసినట్టు ఆరోపణ
- ఎస్సై, కోన వెంకట్ సహా పలువురిపై అట్రాసిటీ కేసు
టీడీపీలో చేరిన తనపై సినీ రచయిత కోన వెంకట్, ఎస్సై జనార్ధన్ సహా పలువురు నాయకులు దాడిచేసినట్టు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేశ్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలోనే తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ వకుల్ జిందాల్.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గణపవరం ఎస్సీ నాయకుడైన రాజేశ్ తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాజేశ్ తమ వద్ద రూ. 8 లక్షలకు పైగా తీసుకుని తిరిగి ఇవ్వకుండానే టీడీపీలో చేరారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్‌లోనే దాడి
ఫిర్యాదు అందుకున్న పోలీసులు రాజేశ్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాపట్ల వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండల వైసీపీ ఇన్‌చార్జ్ అయిన సినీ రచయిత కోన వెంకట్, తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై సమక్షంలోనే తనపై దాడికి పాల్పడినట్టు రాజేశ్ ఆరోపించారు. ఎస్సై కూడా తనపై దాడికి పాల్పడినట్టు చెప్పారు. విషయం తెలిసిన టీడీపీ లోక్‌సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి కర్లపాలెం చేరుకున్నారు. అనంతరం రాజేశ్ కుటుంబం, గణపవరం ఎస్సీ కాలనీ వాసులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కోన రఘుపతి, వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎస్సైపై సస్పెన్సన్ వేటు
తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు రాజేశ్ ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి పది గంటల సమయంలో బంధువులు, టీడీపీ నేతలు, ఎస్సీ కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దళిత యువకుడు రాజేశ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఎస్సై జనార్ధన్ సమక్షంలోనే దాడి జరగడంపై డీఎస్పీ మురళీకృష్ణ తీవ్రంగా పరిగణించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు, రాజేశ్‌పై దాడిచేసిన కోన వెంకట్, మార్పు బెనర్జీ, మార్పు రత్నం, కాగిత మోజెస్ (మోషే), ఉపాధ్యాయుడు సంతోష్, ఎస్సై జనార్ధన్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.