Nadendla Manohar: ఓటు వేసేందుకు ఏపీకి వస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరం: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar demands more RTC buses for who is coming to vote in AP

  • ఏపీలో రేపు ఎన్నికలు
  • పొరుగు రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు తరలి వస్తున్న ప్రజలు
  • తగినన్ని బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న నాదెండ్ల మనోహర్
  • ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి

ఏపీలో మే 13 (సోమవారం) నాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సొంతూళ్లలో ఓటు  వేసేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు ఏపీకి తరలి వస్తున్నారు. అయితే, వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. 

సీఎం జగన్ సభలకు ఉరుకులు పరుగులు పెడుతూ బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు, సాధారణ ప్రయాణికుల సమస్యలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎంతోమంది ఏపీ వాసులు ఉన్నారని, వారందరూ ఇప్పుడు ఓటు వేసేందుకు ఏపీకి వస్తున్నారని నాదెండ్ల వెల్లడించారు. అయితే వారు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీ కనీస బాధ్యత అని, కానీ ఈ విషయాన్ని విస్మరించి తగిన బస్సులు ఏర్పాటు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని నాదెండ్ల విమర్శించారు. 

ఓటు వేసేందుకు సొంత రాష్ట్రానికి వస్తున్న ప్రజల ఇబ్బందులపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని, ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఓటు వేసేందుకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వస్తున్న ప్రజల ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయని నాదెండ్ల పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ తగినన్ని బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News