AP Assembly Polls: 6.30 గంటలకే భారీ క్యూలైన్లు.. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర
- ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల పండుగ
- ఓటింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- పకడ్బందీ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాల్లో ఓటింగ్ షరూ అయ్యింది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటలకే భారీ క్యూ లైన్లు కనిపించాయి. వేర్వేరు పనులు, తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఏపీ అసెంబ్లీ బరిలో 2,387 మంది అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల సమాచారం విషయానికి వస్తే అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ బరిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 కోట్లుగా ఉంది. అందులో పురుషులు - 2,03,39,851, మహిళలు - 2,10,58,615, థర్డ్ జెండర్ - 3,421గా ఉన్నారు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు - 46,389 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 12,438గా ఉన్నాయి. మొత్తం 34,651 (74.7 శాతం) పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా 4వ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది.