Youtuber Savukku Shankar: పోలీసులను దుష్టులు, స్త్రీలోలులుగా అభివర్ణించిన యూట్యూబర్‌పై గూండా చట్టం ప్రయోగించిన కోయంబత్తూరు పోలీసులు
- ఓ ఇంటర్వ్యూలో పోలీసులపై అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు యూట్యూబర్
- అరెస్ట్ చేసి గూండా చట్టం ప్రయోగించిన కోయంబత్తూరు సైబర్ క్రైం పోలీసులు
- యూట్యూబర్ శంకర్‌పై డ్రగ్ కేసు సహా ఏడు పెండింగ్ కేసులు
పోలీసులు, మహిళా పోలీసులపై అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు యూట్యూబర్ సవుక్కు శంకర్‌ను అరెస్ట్ చేసిన కోయంబత్తూరు సైబర్ క్రైం పోలీసులు ఆయనపై కఠినమైన గూండాచట్టం ప్రయోగించారు. ‘రెడ్ పిక్స్ 24x7’ అనే చానెల్ యజమాని ఫెలిక్స్ గెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ సీనియర్ పోలీసు అధికారులు, మహిళా పోలీసు సిబ్బందిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
శంకర్‌పై డ్రగ్ కేసు సహా దేశవ్యాప్తంగా ఏడు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. తాజాగా ఆయనపై గూండాస్ యాక్ట్ విధించినట్టు పేర్కొన్నారు. కాగా ఈ నెల 10న ఇదే కేసులో గెరాల్డ్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా, శంకర్ తన ఇంటర్వ్యూలో పోలీసులను దుష్టులు, స్త్రీలోలులుగా అభివర్ణించారు.