JC Prabhakar Reddy: ఒకే బూత్ లో ఎదురెదురుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఫ్యాక్షన్ సీన్

JC Prabhakar Reddy and Peddareddy in same polling booth
  • పోలింగ్ బూత్ లో ఒకరినొకరు చూసుకుంటూ ఎదురెదురుగా నిలబడ్డ జేసీ, పెద్దారెడ్డి
  • ఆందోళనకు గురైన పోలీసులు, ఓటర్లు
  • వెళ్లిపోవాలని ఇద్దరికీ నచ్చజెప్పిన పోలీసులు
ఏపీలో అత్యంత సున్నితమైన నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య అక్కడ దశాబ్దాల వైరం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తరచుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటాయి. తాజాగా ఈరోజు పోలింగ్ సందర్భంగా మరోసారి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. 

ఒకే పోలింగ్ బూత్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎదురెదురుగా నిలబడ్డారు. ఈ సన్నివేశం అక్కడున్న అందరిలో ఒక్కసారిగా టెన్షన్ ను పెంచింది. ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం ఆందోళనకు గురయ్యారు. 

ఇక్కడి నుంచి వెళ్లిపోండి సార్ అని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. ముందు ఆయన్నే పంపాలని పెద్దారెడ్డి అన్నారు. అట్లా కాదు... ముందు పెద్దారెడ్డినే పంపించండి అని జేసీ చెప్పారు. దీంతో, ఉత్కంఠ పెరిగింది. దీన్ని చూస్తున్న వాళ్లకు ఒక ఫ్యాక్షన్ సీన్ చూస్తున్నట్టు అనిపించింది. పోలీసులు బతిమిలాడటంతో... కాసేపటి తర్వాత ఇద్దరు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
JC Prabhakar Reddy
Peddareddy
Tadipatri

More Telugu News