Prime Minister: స్వయంగా గరిటె తిప్పి.. భక్తులకు పాయసం వడ్డించిన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో
- ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలోని గురుద్వారా సందర్శన
- సిక్కుల సంప్రదాయ తలపాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు
- దైవ సేవలో భాగంగా రొట్టెలు ఒత్తి పాయసం వడ్డించిన ప్రధాని
ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పట్నాలోని గురుద్వారాను సందర్శించారు. సంప్రదాయ సిక్కుల తలపాగా ధరించి ప్రార్థనాలయంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన శ్రీ పట్నా సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం గురుద్వారాలోని వంటశాలలోకి ప్రధాని వెళ్లారు. దైవ సేవలో భాగంగా పొయ్యిపై ఉన్న భారీ వంట పాత్రలో తయారవుతున్న పాయసం ప్రసాదాన్ని స్వయంగా గరిటెతో కలియదిప్పారు. ఆ తర్వాత ఓ స్టీల్ బకెట్ లోకి ఆ ప్రసాదాన్ని తీసుకొని భక్తులకు తన చేత్తోనే వడ్డించారు.
అంతకుముందు రొట్టెలు కూడా ఒత్తారు. తన దర్శన వివరాలతోపాటు ఫొటోలను మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘ఈ ఉదయం తఖ్త్ శ్రీ హరిమందర్ జీ పాట్నా సాహిబ్ లో ప్రార్థనలు చేశా. సిక్కు మతం సమానత్వం, న్యాయం, దయ సూత్రాలతో నిండినది. ఈ మతంలో సేవ ప్రధానమైనది. దైవ సేవలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇది నాకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది’ అని కామెంట్ ను జోడించారు. మరోవైపు మోదీ దైవ సేవలో నిమగ్నమైన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ ఐ తన ‘ఎక్స్’ ఖాతాలో నెటిజన్లతో పంచుకుంది. పట్నా ప్రాంతం సిక్కుల 10వ గురువు అయిన గురు గోబింద్ సింగ్ జన్మస్థలం కావడంతో ఈ గురుద్వారాకు విశేష ప్రాధాన్యం ఉంది.