KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పోరాటం అంత ఈజీ కాదు... దీనిని కొనసాగిద్దాం: కేటీఆర్ ట్వీట్
- బీఆర్ఎస్ నాయకులు, సైనికులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్
- పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడారని ప్రశంస
- క్లిష్ట సమయంలో సోల్ మీడియా వారియర్లు సహకరించారన్న కేటీఆర్
లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పోరాటం అంత సులువు కాదని... అద్భుతంగా పోరాటం చేశారని.. దీనిని కొనసాగిద్దామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులకు, సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడారని ప్రశంసించారు. మీరు ఎంత బలమైన పంచ్ వేస్తారనేది కాదు... ఎదుటివారి ఎంతటి బలమైన పంచ్‌ను మీరు స్వీకరించగలుగుతారనేది ముఖ్యమని... ఇదే పోరాటాన్ని కొనసాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వెంటనే తేరుకొని పోరాడటం అంత ఈజీ కాదన్నారు. కానీ బీఆర్ఎస్ సైన్యం మాత్రం అద్భుత పోరాట పటిమను కనబరిచి పార్టీ అధినేత కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో ఐదు నెలలుగా మనకు సహకరించిన సోషల్ మీడియా వారియర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దామన్నారు. అందరికీ తెలియని విషయం ఏమంటే, ఇతర పార్టీల్లా మనకు పెయిడ్ ఐటీ సెల్ లేదన్నారు. కేవలం తెలంగాణ, కేసీఆర్‌పై ఉన్న ప్రేమతో గొంతెత్తిందన్నారు. కఠినమైన పోరాటం తర్వాత మంచి జరగాలని ఆశిద్దామని పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు... జై తెలంగాణ అని ముగించారు.