Sajjala Ramakrishna Reddy: ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు.. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తింది: సజ్జల

Sajjala comments on polling trend in AP

  • ఏపీలో నేడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదన్న సజ్జల  
  • ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య    

ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ నేతలు పోలింగ్ సరళిపై సంతోషం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. 

ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే, ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. 

ఓటింగ్ పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తమ అజెండా అని, పేదల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని స్పష్టం చేశారు.

కాగా, ఇవాళ పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు ఉదయం నుంచి అరాచకాలకు తెరలేపారని, చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లకు దిగారని... పీలేరు, సత్తెనపల్లి, అద్దంకిలో టీడీపీ కార్యకర్తలు, గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. 

టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేయడమే కాకుండా, ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని... అయితే, వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని, వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News