Devineni Uma: వీటి గురించి చెప్పలేదేం సజ్జలా!: దేవినేని ఉమా

Devineni Uma counters Sajjala remarks

  • ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు వెల్లువెత్తిందన్న సజ్జల
  • టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపణలు
  • వైసీపీ వాళ్లు ఇవాళే ఏమేం చేశారో ఏకరవుపెట్టిన దేవినేని ఉమా
  • సజ్జల సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు

పేదలకు సీఎం జగన్ చేసిన సంక్షేమం ఇవాళ ఓటు రూపంలో పోటెత్తిందని, సానుకూల ఓటుతో ప్రజలు పోలింగ్ కేంద్రాలను ఉప్పెనలా ముంచెత్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం తెలిసిందే. ఉదయం చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లతో మొదలుపెట్టి టీడీపీ శ్రేణులు ఇవాళ్టి పోలింగ్ లో పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డాయని అన్నారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నా, ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని, నంగనాచిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

"సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి... మీ ఖేల్ ఖతం! మీ దుకాణం బంద్! బేలగా మాట్లాడడం మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి. ఇంకా ప్రజలను నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నారు. 

ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని బూరగమంద గ్రామంలో పోలింగ్ ఏజెంట్లను ఎత్తుకెళ్లిపోయారు. మీ దుర్మార్గాలకు, మీ పాపాలకు, మీ మాట విన్నందుకు అక్కడ ఎస్సై సస్పెండ్ అవుతున్నాడు. మాచర్ల  నియోజకవర్గంలో ఇవాళ  మీరు ఎన్ని అరాచకాలు, దుర్మార్గాలు, దాడులు చేశారో తెలుసా? చివరికి మీ ఎమ్మెల్యే అభ్యర్థిని గృహనిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. 

ఉరవకొండ 129వ బూత్ లో మీ వాళ్లు పోలింగ్ అధికారులతో గొడవకు దిగారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో మా ఏజెంట్లపై మీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడప జిల్లా చాపాడు మండలంలో ఉలవలూరు గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్లను బయటికి లాగి మీరు చేసిన అరాచకాలను చెప్పలేకపోయావా సజ్జలా? 

శ్రీశైలం 4, 5 పోలింగ్ కేంద్రాల్లో మీ నేతలు చేసిన అరాచకాలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ విషయంలో మీరు చేసిన అరాచకాలు, పల్నాడు జిల్లా గురజాల, దాచేపల్లి మండలంలో పోలింగ్ బూత్ ల వద్ద మీ కార్యకర్తల దాడులు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో టీడీపీ కార్యకర్తలపై మీ నాయకుల దాడులు, ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో 178వ బూత్ లో మీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోలింగ్ ప్రక్రియను ఆపడం... ఇందాక వీటి గురించి మాట్లాడలేదేం సజ్జలా? 

నెల్లూరు జిల్లా కమ్మవారి గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని ఆ ఊరి వాళ్లు పోలింగ్ నే బహిష్కరించారు. సజ్జల ఇంకా సిగ్గులేకుండా అభివృద్ధి గురించి, ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు" అంటూ దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News