Chandrababu: ప్రత్యేక విమానంలో వారణాసికి చంద్రబాబు.. ఇప్పటికే చేరుకున్న పవన్ కల్యాణ్

Chandrababu left for Varanasi and Janasena chief Pawan Kalyan has already arrived there

  • ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు
  • అనంతరం నిర్వహించనున్న ఎన్డీఏ బహిరంగ సభలో ప్రసంగం
  • వారణాసిలో ఘనంగా మోదీ నామినేషన్‌కు బీజేపీ ఏర్పాట్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీయే పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరతారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు.

కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీయే పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు.

6 కిలోమీటర్ల మేర మోదీ రోడ్‌షో..
వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ వంద చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మోదీపై దారిపొడవునా పూలవర్షం కురిపించనున్నారు. ఇక కాషాయరంగు దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతారు. రోడ్‌షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉంటారు.

  • Loading...

More Telugu News