Raghu Rama Krishna Raju: జూన్ 4న వైసీపీ పెద్దకర్మలో అందరం పాలుపంచుకుందాం: రఘురామకృష్ణరాజు
- నేడు రఘురామకృష్ణరాజు బర్త్ డే
- తన జన్మదినం నాడే వైసీపీ పతనమైనందుకు సంతోషంగా ఉందన్న రఘురామరాజు
- రాజకీయ చిత్రపటంలో ఇక వైసీపీ కనిపించదని జోస్యం
- కూటమి విజయం తథ్యమని ధీమా
నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పతనం నిన్ననే ప్రారంభమైనప్పటికీ తన పుట్టిన రోజు నాడే అంతమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన జననం రోజే వైసీపీ మరణించిందని, జూన్ 4న జరగనున్న పెద్దకర్మలో అందరూ పాల్గొందామని పిలుపునిచ్చారు. రాజకీయ చిత్రపటంలో యువజన శ్రామిక రైతు పార్టీ (వైసీపీ) ఇక ఉండే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ఈ రోజు సాక్షి దినపత్రికలో వైసీపీ 112 స్థానాలు గెలుస్తుందని రాశారని, ‘వైనాట్ 175’ నుంచి 112కి దిగివచ్చారని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో విధుల్లో ఉన్న దాదాపు 4.5 లక్షల మంది ఓటు వేశారని, ఇంతమంది ఓటువేయడం చరిత్రలోనే ఇది తొలిసారని పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ కూటమికే ఓటు వేశారని తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి సంక్రాంతికి మించి సొంతూళ్లకు తరలివచ్చి ఓటేశారని, ఓ రాక్షసుడిని వదిలించుకోవాలన్న కసితో పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 20 లక్షల మంది తరలి వచ్చారని, వారిలో ఒక పదిశాతం మినహా మిగతా అందరూ కూటమికే ఓటువేశారని వివరించారు.
మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైసీపీకి ఓటేశారని వారి పేపర్‌లో రాసుకున్నారని, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం నిజమేనని, కాకపోతే వారు ఓటు వేసింది మాత్రం టీడీపీకేనని చెప్పారు. తమ పుస్తెలతో ఆటలాడుకున్నందుకు వారంతా కోపంగా ఉన్నారని, వారు ఓటు వేసింది తమకేనని రఘురామకృష్ణరాజు తెలిపారు.