Ambati Rambabu: సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు... అందుకే పోలింగ్ శాతం పెరిగింది: అంబటి రాంబాబు
- ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఎన్నికల సంఘం
- జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారన్న అంబటి
- జగన్ కు ఓటేసేందుకు ప్రజల తపన నిన్న స్పష్టంగా కనిపించిందని వెల్లడి
ఏపీలో గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం చెబుతున్న నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిన్న పోలింగ్ జరగ్గా, ఓటర్లు వెల్లువలా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడాన్ని ఆయన పాజటివ్ ఓటుగా అభివర్ణించారు. వారంతా సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారని వెల్లడించారు.
గతంలో, ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావించేవాళ్లమని, కానీ ఈసారి సీఎం జగన్ ను మళ్లీ గెలిపించేందుకు మహిళలే భారీగా ముందుకొచ్చారని, 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారని వివరించారు.
సీఎం జగన్ ఐదేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటిని తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, జగన్ పాలనను చూసిన వారు ఓటు వేయడానికి భారీగా తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.
ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని... మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారని మంత్రి అంబటి వివరించారు. జగన్ కు ఓటేయడానికి పడిన తపన ప్రజల్లో నిన్న స్పష్టంగా కనిపించిందని అన్నారు.