Nano Gel: మందుబాబులకు శుభవార్త... లివర్ ను కాపాడే నానో జెల్ ను ఆవిష్కరించిన సైంటిస్టులు
- లివర్ పై అత్యధిక ప్రభావం చూపించే మద్యపానం
- లివర్ డ్యామేజి అయితే ప్రాణాంతకం
- తాగకుండా ఉండలేని వారి కోసం ఇంటాక్సికెంట్ జెల్
- స్విట్జర్లాండ్ పరిశోధకులు వినూత్న సృష్టి
మద్యం అధికంగా తాగే వారిలో లివర్ (కాలేయం) దెబ్బతినడం చాలా కామన్ గా కనిపించే అంశం. ఒక్కసారి లివర్ దెబ్బతింటే, శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కానీ మందుబాబులు ఇలాంటి ఆరోగ్య హెచ్చరికలు పట్టించుకోకుండా, మితిమీరి మద్యం సేవించి పీకల మీదికి తెచ్చుకుంటారు. అలాంటి వారికి శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు.
మద్యం తాగినా ఆ ప్రభావం లివర్ పై పడకుండా కాపాడే ఓ జెల్ ను స్విట్జర్లాండ్ పరిశోధకులు ఆవిష్కరించారు. దీన్ని ఇంటాక్సికెంట్ జెల్ అని పిలుస్తారు. ఇది ఉదరంలో, పేగుల్లో ఒక పూతలా, రక్షణ కవచంలా ఏర్పడి, మద్యం ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందట.
సాధారణంగా, మద్యం సేవించినప్పుడు ఆ మద్యం ఉదరంలోకి చేరి పేగుల్లోని మ్యూకస్ మెంబ్రేన్ పొర ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన మద్యం కాలేయాన్ని చేరుకుంటుంది. అక్కడి హార్మోన్ లతో జరిపే రసాయనిక చర్యలతో మద్యం కాస్తా ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్ అనే విషపదార్థంగా మారుతుంది. ఇది తక్కువ సమయంలోనే లివర్ ను దెబ్బతీస్తుంది.
అయితే, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్న జెల్ ఎలా పనిచేస్తుందంటే...ఈ జెల్ ఉదరంలో, పేగుల్లో ఒక పొరలా ఏర్పడుతుంది. ఈ జెల్ లో నానో ప్రొటీన్ లు ఉంటాయి కాబట్టి జీర్ణం కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి, మద్యం పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది.
అంతేకాదు, మద్యం పేగుల్లోకి రాగానే ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ హైడ్రోజెన్ పెరాక్సైడ్... మద్యంతో చర్య జరిపి హాని చేయని ఎసిటిక్ ఆసిడ్ లా మార్చేస్తుంది. దాంతో ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరినా దాని ప్రభావం పెద్దగా ఉండదు.
ప్రస్తుతానికి దీన్ని ఎలుకలపై పరీక్షించి చూడగా సత్ఫలితాలు వచ్చాయి. ఈ నానో జెల్ లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్, వే ప్రొటీన్ నుంచి తయారయ్యే నానో ఫైబర్ అణువులు ఉంటాయి.
ఈ నానో జెల్ ను తయారుచేసిన శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించి రఫెల్ మెజెంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మద్యం తాగకుండా ఉండడమే మంచిదని అన్నారు. అయితే మద్యం తాగకుండా ఉండలేని వారి కోసమే ఈ జెల్ అని స్పష్టం చేశారు.