Gorantla Butchaiah Chowdary: అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేసింది జగన్ ను సాగనంపడానికే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ఏపీలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చారన్న గోరంట్ల
- ప్రజాతీర్పు జగన్ కు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్య
- వైసీపీ ముఖ్య నేతలకు డిపాజిట్లు కూడా రావన్న బుచ్చయ్య
ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలి వచ్చి తమ తీర్పును వెలువరించారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు భరించి, ఓపిక నశించి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన ప్రజలు ఉదయం 5 నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయడం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతోందని అన్నారు.
ఈ ఐదేళ్లలో ప్రతి రంగాన్ని కూల్చారు, ప్రతి వర్గాన్ని అధోగతిపాలు చేశారు, ఉద్యోగులను, దళితవర్గాలను, బలహీన వర్గాలను అణగదొక్కారని మండిపడ్డారు.
"వైసీపీ సామ్రాజ్యంలో ఇష్టారీతిన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నియంత పోకడ పోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఒక ఉద్యమంలా పోరుబాట పట్టినట్లు ఓటు బాట పట్టారు. ఈ ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది.
ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా ముందుకు సాగింది. తాము చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం కొంతమంది జాగీరులా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు నిన్న జరిగిన పోలింగ్ విధానం తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పును ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును 80 శాతం పైబడి వినియోగించుకోవడం శుభపరిణామం. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోలుకోలేని చావు దెబ్బ తగలబోతుంది.
హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం, దాన్ని సమర్థించడం, గోబెల్స్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలు శాపంగా మారబోతున్నాయి. 2019లో ప్రజలు 151 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్రం నాశనమైంది. రూ.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు.
జగన్మోహన్ రెడ్డి రంగులు, పేర్ల పిచ్చి వల్ల ప్రభుత్వ పథకాలను అడ్డు పెట్టుకుని పిల్లలు అడుకునే ఆట వస్తువులపై, పిల్లలు వేసుకునే లంగోటాలపై, కోడిగుడ్లపై కూడా బొమ్మలు వేసుకునే దరిద్రపు ఆలోచన ఏ ముఖ్యమంత్రికీ రాకూడదని మేం కోరుకుంటున్నాం.
టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి విజయం తధ్యం. చంద్రబాబు నిర్విరామ కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలవబోతుంది. అగ్నికి, వాయువు తోడైనట్లు పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది. వీళ్ల కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మోడీ ఏపీకి సహకరిస్తారనే ఉద్దేశంతో పోలింగ్ ఈ స్థాయిలో జరిగింది.
వైసీపీ సీనియర్ నాయకులకు డిపాజిట్లు గల్లంతై, అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి రాబోతుంది. ఈ ప్రజా తిరుగుబాటు వైసీపీకి గుణపాఠం కాబోతుంది...ఎన్డీయే కూటమి విజయం సాధించబోతుంది... చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది" అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.