Subrahmanyam Jaishankar: అమెరికాకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టి కౌంటర్

S Jaishankar Responds To US Sanction Warning Over Chabahar Port Deal with Iran

  • ఇరాన్‌, భారత్ ఒప్పందం వేళ ఆంక్షల ముప్పు తప్పదన్న అమెరికా 
  • చబహార్ పోర్ట్ ఒప్పందాన్ని సంకుచిత భావంతో చూడొద్దన్న భారత విదేశాంగ మంత్రి
  • గతంలో ఈ పోర్టు ఔచిత్యాన్ని అమెరికా గుర్తించిందంటూ విమర్శించిన జైశంకర్

ఇరాన్‌లోని చబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరించడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. కీలకమైన ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చనుందని, ఈ ఒప్పందాన్ని సంకుచిత భావంతో చూడకూడదని అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. గతంలో చబహార్ పోర్ట్ ప్రాధాన్యతను స్వయంగా అమెరికానే ప్రశంసించిందని ఆయన ప్రస్తావించారు. తాను రాసిన ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకం బంగ్లా ఎడిషన్‌ను బుధవారం ఆయన కోల్‌కతాలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చబహార్ పోర్టు ఒప్పందంపై అమెరికా స్పందనను ప్రస్తావించగా జైశంకర్ ఈ సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను తాను కూడా చూశానని, ఈ ఒప్పందం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించినదని అన్నారు. చబహార్‌ పోర్టు పట్ల అమెరికా వైఖరిని పరిశీలిస్తే ఎంతో ఔచిత్యం కలిగిన పోర్టుగా గతంలో మెచ్చుకుందని, ఈ పోర్టునే తాము నిర్వహించబోతున్నామని జైశంకర్ అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌తో భారత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉందని, అయితే దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయలేకపోయామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా చబహార్ పోర్ట్‌ను పదేళ్లపాటు నిర్వహించేందుకు ఇరాన్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి ముఖ్యమైన పోర్టుగా ఉండడంతో భారత్ వ్యూహాత్మకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఇరాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా మంగళవారం హెచ్చరించింది. ఇరాన్‌-భారత్ ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News