private gold mine: దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఏపీలో సిద్ధం.. ఇక ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి!

indias first private gold mine to be operational by the end of this year
  • కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఏర్పాటవుతున్న బంగారు గని 
  • రూ. 200 కోట్ల పెట్టుబడి పెట్టిన డెక్కన్ గోల్డ్ మైన్స్.. 250 ఎకరాల భూసేకరణ 
  • 60 శాతం పూర్తయిన ప్లాంటు నిర్మాణం.. ఇప్పటికే రోజుకు కిలో బంగారం ఉత్పత్తి
దేశంలోకెల్లా తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 

సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికితీసేందుకు రూ. 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. 

మరోవైపు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని బంగారం గనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ఆసక్తి చూపుతోంది. ఈ గనులను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. 

దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ కు దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్‌ గనులను ఆ సంస్థ తాజాగా కొనుగోలు చేసింది. రోజుకు 100 టన్నుల లిథియం, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్లు నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

తాజాగా రాజస్తాన్‌లో అమ్మకానికి పెట్టిన రెండు బంగారు గనులను సొంతం చేసుకొనేందుకు వేదాంతా గ్రూపు సంస్థ అయిన హిందూస్థాన్‌ జింక్‌, జిందాల్‌ పవర్‌, జేకే సిమెంట్‌ పోటీపడుతున్నాయి. రాజస్తాన్‌లోని కంక్రియా గారా గోల్డ్‌ బ్లాక్‌, భూకియా-జగ్‌పురా గోల్డ్‌ బ్లాక్‌లను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తోంది. తాజాగా వేలంలో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత సాధించిన కంపెనీల్లో అవి కూడా ఉన్నాయి.
private gold mine
first in india
Andhra Pradesh
Kurnool District

More Telugu News