Pulivarthi Nani: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని.. చెవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న అమర్ నాథ్ రెడ్డి
- తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీలో పులివర్తి నానిపై దాడి
- నానితో పాటు భద్రతా సిబ్బందికి కూడా గాయాలు
- దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమర్ నాథ్ రెడ్డి డిమాండ్
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన... గాయపడిన తన గన్ మెన్ ను కలిసి పరామర్శించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో నానితో పాటు ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. దాదాపు 150 మందికి పైగా కత్తులు, రాడ్లతో వచ్చి దాడికి పాల్పడినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు.
మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిలో పులివర్తి నానిని మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నానిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చెవిరెడ్డి కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని... అందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలేసి, టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నానిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.