Indian Boy: భారత బుడతడి నిజాయతీకి దుబాయ్ పోలీసుల ఫిదా!
- దుబాయ్ లో ఓ టూరిస్ట్ పోగొట్టుకున్న వాచ్ తెచ్చిచ్చిన యూనిస్
- మెచ్చుకొని అవార్డు అందించిన అక్కడి పోలీసులు
- యూఏఈ ప్రజల నైతిక విలువలకు ఇది నిదర్శనమంటూ ‘ఎక్స్’లో పోస్ట్
దుబాయ్ లో నివసిస్తున్న ఓ భారత బుడతడి నిజాయతీ, చిత్తశుద్ధికి దుబాయ్ పోలీసులు ఫిదా అయ్యారు. రోడ్డుపై ఓ విదేశీ పర్యాటకుడు పోగొట్టుకున్న వాచ్ ను ఆ బాలుడు తెచ్చివ్వడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. బాలుడికి అవార్డు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను దుబాయ్ పోలీసు శాఖ ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది.
ముహమ్మద్ అయాన్ యూనిస్ అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రితో కలసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ కు ఓ వాచ్ కనిపించింది.
దీంతో దాన్ని తీసుకొని సమీపంలోని పోలీసు స్టేషన్ లో అప్పగించాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు వాచ్ పోగొట్టుకున్నట్లు వెల్లడైంది.
స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వాచ్ ను తిరిగి అతనికి పంపే ఏర్పాటు చేశారు.
అలాగే తనకు దొరికిన వాచ్ ను నిజాయతీగా అప్పగించినందుకు బాలుడిని ప్రశంసిస్తూ ఓ అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్, కెప్టెన్ షహాబ్ అల్ సాదీ పాల్గొన్నారు.
యూఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు, పోలీసులు అమలు చేసే భద్రతా ప్రమాణాలకు ఇదో నిదర్శనమని దుబాయ్ పోలీసు శాఖ ‘ఎక్స్’లో పేర్కొంది. యూనిస్ నిజాయతీని నెటిజన్లు ప్రశంసించారు.