Slovakia: కాల్పుల్లో గాయపడ్డ స్లోవేకియా ప్రధానికి విజయవంతంగా సర్జరీ
- ప్రాణాపాయం తప్పిందన్న ఉప ప్రధాని
- హత్యాయత్నానికి గల కారణం ఇంకా తెలియని వైనం
- గత నెల జరిగిన స్లొవేకియా అధ్యక్ష ఎన్నికలు కారణం కావొచ్చని స్థానిక మీడియా అనుమానం
హత్యాయత్నానికి గురైన స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ప్రస్తుతం కోలుకుంటున్నారు. దుండగుడి కాల్పుల్లో తూటాలు శరీరంలోకి దూసుకుపోగా వైద్యులు ఆయనకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం తప్పిందని దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తరాబా మీడియాకు వెల్లడించారు.
హాండ్లోవా పట్టణంలో బుధవారం తన మద్దతుదారులతో సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫికో అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వృద్ధుడు ఆయనపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడటం తెలిసిందే. దీంత ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హుటాహుటిన ప్రధాని ఫికోను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని 71 ఏళ్ల జురాజ్ సింటులాగా స్థానిక మీడియా గుర్తించింది.
అయితే హత్యాయత్నానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చని స్థానిక మీడియా అనుమానిస్తోంది.
మరోవైపు రాబర్ట్ ఫికోపై హత్యాయత్నానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రెప్పపాటులో కాల్పులు జరగడం, ఆయన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, నిందితుడిని అదుపులోకి తీసుకోవడం అందులో కనిపించింది.