Virat Kohli: రిటైర్‌మెంట్‌పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి క్రికెట్ నుంచి వైదొలిగితే.. ఇక అంతే సంగ‌తుల‌ట‌!

Virat Kohli reveals his post retirement plans

  • ఆర్‌సీబీ రాయల్ గలా డిన్నర్ ప్రోగ్రామ్ లో రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి వెల్లడించిన విరాట్‌
  • క్రికెట్‌ కెరీర్ నుంచి వైదొలిగిన‌ తర్వాత కొంతకాలం ఎవరికీ కనిపించనని వ్యాఖ్య‌
  • ఇప్పటికైతే త‌న‌కు కెరీర్ పరంగా ఎలాంటి రిగ్రెట్స్ లేవన్న కోహ్లీ  

భార‌త‌ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తాజాగా వెల్లడించాడు. క్రికెట్‌ కెరీర్ నుంచి వైదొలిగిన‌ తర్వాత కొంతకాలం ఎవరికీ కనిపించనని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న విరాట్ ఇటీవ‌ల‌ ఆర్‌సీబీ రాయల్ గలా డిన్నర్ ప్రోగ్రామ్ లో ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు.
 
ఈ కార్య‌క్ర‌మంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "ప్ర‌తి క్రీడాకారుడికి కెరీర్ ముగించాల్సిన రోజు ఒకటి ఉంటుంది. నేను కూడా ఎప్పటికీ ఇలాగే ఆడలేను. నాకు ఇప్పటికైతే కెరీర్ పరంగా ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఆ రోజు ఇలా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ కెరీర్ను ముగించడం నాకు ఇష్టం ఉండ‌దు. చేయలేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్తా. ఇక ఏదో ఒకరోజు నేను కూడా ఆటకు ముగింపు పలుకుతా. ఆ తర్వాత కొంతకాలం మీకు ఎవరికీ నేను కనిపించను. అందుకే ఆడినన్ని రోజులు నా బెస్ట్‌ ప్ర‌ద‌ర్శ‌న‌ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది" అని విరాట్ అన్నాడు. 

ఇక 35 ఏళ్ల విరాట్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిట్నెస్ సమస్యతో జట్టుకు దూరమైన సంద‌ర్భం లేద‌నే చెప్పాలి. 2008లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన కోహ్లీ టీమిండియాకు ఎన్నో మ‌రుపురాని విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్లలో విరాట్ తనదైన మార్క్ చూపుతూ కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లతో పాటు ప‌లు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈసారి ఐపీఎల్‌లోనూ అద‌ర‌గొడుతున్న‌ కింగ్ కోహ్లీ
ప్రస్తుత ఐపీఎల్లోనూ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ ఏకంగా 155.16 స్ట్రైక్ రేట్‌, 66.10 సగటుతో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్ లో అందరికంటే ముందున్నాడు. ఈ సీజ‌న్‌లో ఐదు హాఫ్ సెంచ‌రీల‌తో పాటు ఒక సెంచ‌రీ కూడా బాదాడు. ఇక ఆర్‌సీబీ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు అత్యంత కీలకం కానుంది. బెంగ‌ళూరు 13 మ్యాచుల్లో 12 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంటే.. సీఎస్‌కే 13 మ్యాచుల్లో 7 విజ‌యాలు సాధించి 14 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై నెట్ ర‌న్ రేట్ +0.528గా ఉంటే.. ఆర్‌సీబీది +0.387గా ఉంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పుపొంచి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే మాత్రం బెంగ‌ళూరు టోర్నీ నుంచి వైదొలగుతుంది.

  • Loading...

More Telugu News