Janga Krishna Murthy: తన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై వేటు వేయడంపై జంగా కృష్ణమూర్తి స్పందన
- బీసీలను అణగదొక్కేలా వైసీపీ వ్యవహరించిందన్న కృష్ణమూర్తి
- మండలి ఛైర్మన్ పై ఒత్తిడి చేశారని ఆరోపణ
- ఎవరినైనా వాడుకుని వదిలేయడం వైసీపీ నైజమని విమర్శ
ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణమూర్తిపై వేటు వేస్తూ నిన్న అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై కృష్ణమూర్తి స్పందిస్తూ... తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా వచ్చింది కాదని... బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని చెప్పారు. వైసీపీ అధిష్ఠానం మండలి ఛైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేసేలా చేసిందని విమర్శించారు. బీసీల నాయకత్వాన్ని అణగదొక్కేలా వైసీపీ యత్నించిందని అన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడం వైసీపీ నైజమని దుయ్యబట్టారు. పార్టీ మారిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై రెండేళ్ల పాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కృష్ణమూర్తి ఇటీవలే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. గతంలో ఆయన గురజాల నుంచి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్నాడు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.