Madhavi Latha: మాధవీలతపై దాడి చేశారని అనుచరుడు నసీం ఫిర్యాదు... మజ్లిస్ నాయకులపై కేసు నమోదు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మొఘల్‌పుర పోలీసులు
- యాకుత్‌పురా ఎంఐఎం ఇంఛార్జ్ దాడికి ప్రయత్నించారని నసీం ఫిర్యాదు
- మాధవీలత కారులో వెళుతున్న సమయంలోనూ వెంబడించి దాడికి యత్నించారన్న నసీం
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై దాడి కేసులో మజ్లిస్ పార్టీ నేతలపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలింగ్ రోజున తనపై మజ్లిస్ పార్టీ నాయకులు దాడి చేశారని మాధవీలత ఆరోపణలు చేశారు. ఈ దాడికి సంబంధించి మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలింగ్ రోజున మాధవీలత వివిధ ప్రాంతాల్లో తిరిగి బూత్‌లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో యాకుత్‌పురా మజ్లిస్ పార్టీ ఇంఛార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు మాధవీలత అనుచరుడు నసీం ఆరోపించారు. ఆమె కారులో వెళుతున్న సమయంలోనూ పలువురు వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. అలాగే బీబీ బజార్‌లో మాధవీలతను పెద్ద సంఖ్యలో మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీరికి పోలీసులు 41సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయనున్నారు.