Chandrababu: ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ వద్దు... ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ
- ఏపీలో ఈ నెల 17 నుంచి ఈ-ఆఫీస్ నిలిపివేత
- ఈ నెల 15 వరకు అప్ గ్రేడ్ పనులు
- ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ నిలిపివేస్తుండడం పట్ల చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు.
అసలేమిటి ఈ ఈ-ఆఫీస్...?
ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ వ్యవస్థల కార్యకలాపాల సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ పాత వెర్షన్ నుంచి తాజా వెర్షన్ 7.x కు అప్ గ్రేడ్ చేయాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) 14 రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ-ఆఫీస్ అనేది ఒక వెబ్ యాప్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యాప్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఈ-ఆఫీస్ తాజా వెర్షన్ ట్యాంపరింగ్ కు అవకాశం లేనిదని, భద్రతా పరంగా ఎంతో మెరుగైనదని ఎన్ఐసీ చెబుతోంది. ఈ-ఆఫీస్ నిలిచిపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల కదలికలు నిలిచిపోతాయి.