Nepal Ban: ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై మరో దేశం నిషేధం!

Nepal bans sale of Everest MDH spices over safety concerns
  • ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ బ్రాండ్స్ మసాలాల్లో నిషేధిత ఇథిలీన్ ఆక్సైడ్‌ అవశేషాలను గుర్తించిన నేపాల్
  • వీటి దిగుమతి, మార్కెటింగ్‌పై నిషేధం విధించిన ఆహార నియంత్రణ సంస్థ
  • పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడి
  • న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ ఎవరెస్టు, ఎమ్‌డీహెచ్‌పై నిఘా
పాప్యులర్ భారతీయ బ్రాండ్లు ఎవరెస్టు, ఎమ్‌డీఎహ్ మసాలా ఉత్పత్తులపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ క్రిమిసంహారకాన్ని గుర్తించిన నేపాల్ వీటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్‌లు ఈ మసాలా బ్రాండ్‌పై నిషేధం విధించాయి. దీంతో, తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నేపాల్‌కు చెందిన ఆహార నియంత్రణ సంస్థ పరీక్షలు ప్రారంభించింది. ఈ అధ్యయనంలో అధికారులు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ నిషేధం కొనసాగుతుందని నేపాల్ అధికారులు పేర్కొన్నారు. ఈ బ్రాండ్ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు. 

భారతీయులకు చిరపరిచితమైన ఎవరెస్టు, ఎండీహెచ్ మసాలాలు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. అయితే, వీటిల్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ) ఉన్నట్టు హాంకాంగ్, సింగపూర్‌లు తొలిసారిగా గుర్తించాయి. ఆహార ఉత్పత్తుల స్టెరిలైజేషన్‌కు ఈ రసాయనాన్ని వినియోగించేవారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో.. సాల్మొనెల్లా అనే హానికారక బ్యాక్టీరియాతో కలుషితం కాకుండా ఉండేందుకు ఈటీఓను వాడేవారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన అనేక దేశాలు ఈ రసాయనం వాడకంపై నిషేధం విధించాయి. 

మరోవైపు, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా ఈ బ్రాండ్స్‌పై దృష్టిసారించాయి. ఈ విషయమై గురువారం బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే మసాలాల్లో నిషేధిత క్రిమిసంహారకాలు ఉన్నాయో లేదో తేల్చేందుకు గతేడాది నుంచీ పటిష్ఠ చర్యలు ప్రారంభించామని పేర్కొంది.
Nepal Ban
Everest
MDH
Singapore
Hongkong
USA
UK
New Zealand

More Telugu News