Fundamental Right: ఉత్పత్తుల నాణ్యత తెలుసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు
- ఉత్పత్తి నాణ్యతను తెలుసుకోవడం ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమిక హక్కుగా పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు
- ప్రకటన ఏ రూపంలో ఉన్నా స్వీయ డిక్లరేషన్ తప్పనిసరని స్పష్టీకరణ
- పతంజలి కేసులో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా బెంచ్ వ్యాఖ్యలు
మార్కెట్లో ఏది దొరికితే అది కొనేసి అదే మంచిదన్న భ్రమలో ఉంటారు చాలామంది. దాని నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోరు. ఆయా కంపెనీలు కూడా తమ ఉత్పత్తి నాణ్యతకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయవు. అయితే, ఆయా ఉత్పత్తుల నాణ్యత తెలుసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీంకోర్టు పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనదారులు, ప్రకటన ఏజెన్సీలు విక్రయానికి అందించే ఉత్పత్తుల నాణ్యతపై వినియోగదారుడికి అవగాహన కల్పించే హక్కును ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమిక హక్కుగా పరిగణిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ హక్కును రక్షించేందుకు ఇకపై ఆయా ఉత్పత్తుల ప్రకటనల్లో వాటి నాణ్యతపై స్వీయ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రకటనదారుడు/ప్రకటన ఏజెన్సీని ఆదేశించింది. ప్రకటన ఏ రూపంలో ఉన్నా సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరని స్పష్టం చేసింది. పతంజలి కేసు విచారణలో భాగంగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.