Airtel: ఎయిర్‌టెల్ సీఈవో సంకేతాలు.. త్వరలో రీఛార్జ్ రేట్ల పెంపు!
- మొబైల్ రీఛార్జులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్న గోపాల్ విట్టల్
- ప్రస్తుతం రూ.200గా ఉన్న ఏఆర్‌పీయూ రూ.300 ఉండాలని అభిప్రాయం
- ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు పెరగడం ఖాయమంటూ వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు
భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబైల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాలని ఆయన పేర్కొన్నారు. రూ.300లకు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్‌పీయూగా ఉంటుందని విట్టల్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంవత్సరం-2024 నాలుగవ త్రైమాసికానికి ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ.209కు చేరిందని, 2023 నాలుగో త్రైమాసికంలో ఇది రూ.193గా ఉందంటూ ఆయన పోల్చారు. టెలికం రంగంలో టారిఫ్ రేట్లలో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని విట్టల్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాల్లో ఏఆర్‌పీయూలో పెరుగుదల ఉందని, అయితే మరిన్ని పెంపులు అవసరమని అన్నారు. ఎయిర్‌టెల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు గణనీయంగా పెరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెంపుపై ఆయన సంకేతాలు ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ఎయిర్‌టెల్ ప్లాన్‌లు మరింత ఖరీదైనవిగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.