Anam Ramanarayana Reddy: వైసీపీ ఆ ఓట్లు వేసుకోకుండా అడ్డుకోగలిగాం: ఆనం రామనారాయణరెడ్డి

TDP leader Anam Ramanarayana Reddy Press Meet

  • నెల్లూరు జిల్లా యంత్రాంగం వైసీపీకి కొమ్ముకాసిందని ఆరోపణ
  • సమస్యాత్మక మర్రిపాడు మండలంలోని బూత్‌లలో మహిళా కానిస్టేబుళ్లను పెట్టారని మండిపాటు
  • నెల్లూరులో పదికిపది స్థానాల్లోనూ టీడీపీదే గెలుపని ధీమా

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అధికారుల్లో చాలామంది తమకు సహకరించలేదని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాసిందని పేర్కొన్నారు. జిల్లాలోని మర్రిపాడు మండలం సమస్యాత్మకమైదని, అక్కడ నాటుబాంబులు విసురుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ సమస్యాత్మకమైన పది బూత్‌ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు, ఆర్వోకు, కలెక్టర్, ఎస్పీకి అందించినా ఆయా బూత్‌ల వద్ద ఆర్మ్‌డ్ పోలీసులను పెట్టలేదని, ఓ మహిళా కానిస్టేబుల్, ఎన్‌సీసీ క్యాడెట్‌ను పెట్టి ఊరుకున్నారని తెలిపారు. దీనిని బట్టి అధికార యంత్రాంగం ఎవరికి సహకరించిందో తెలుసుకోవచ్చని అన్నారు.  

దీనిపై తాము ఫిర్యాదు చేసిన తర్వాత ఆయా బూత్‌ల వద్దకు స్పెషల్ స్క్వాడ్‌ను పంపారని తెలిపారు. వైసీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి భార్య ఓ బూత్‌లో తిష్టవేసి తన కొడుక్కి ఓటేయాలంటూ ఓటర్లను ప్రలోభానికి గురిచేశారని చెప్పారు. తాము అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయనొచ్చి ఆమెను బయటకు పంపారని తెలిపారు. 

గత ఎన్నికల్లో ఒకటి నుంచి పది బూత్ లలో ప్రతి దాంట్లోనూ వైసీపీ నాయకులు 5 శాతం ఓట్లను మిగిల్చేవారని, ఆ తర్వాత ఆ ఓట్లను వారు వేసుకునే వారని ఆరోపించారు. ఈసారి అలా జరగకుండా తాము అడ్డుకోవడం ద్వారా ఈ పది బూత్ లలో దాదాపు 3 వేల ఓట్లు వారు వేసుకోకుండా అడ్డుకోగలిగామని తెలిపారు. టీడీపీ ఏజెంట్లను అప్రమత్తం చేయడం వల్లే అది సాధ్యమైందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించబోతోందని రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 

  • Loading...

More Telugu News