Alleti Maheshwar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక్క గంట కూడా మంత్రిగా ఉండే అర్హతలేదు... రాజీనామా చేయాలి: బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి

Uttam Kumar Reddy have no right to continue as minister
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శ
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణ
  • ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారని వ్యాఖ్య
సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని, ఆయనకు ఒక్క గంట కూడా మంత్రిగా ఉండే అర్హత లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతాంగాన్ని మోసం చేస్తున్నారని... ఆ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్కో సెంటర్‌లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయం గురించి అవగాహన లేని వ్యక్తిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు ఇష్టారీతిన దోచుకుంటున్నారన్నారు. ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైస్ మిల్లర్లకు ఏం సంబంధమని ప్రశ్నించారు. వారు... రైతులకు ఫోన్ చేసి బస్తాల నుంచి కోత పెడతామని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భారీ దోపిడీ జరుగుతోందన్నారు. రైస్ మిల్లర్లతో ఈ ప్రభుత్వానికి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేదా ప్రభుత్వం నిద్రపోతోందా? లేదా రైస్ మిల్లర్లకు మంత్రి అండగా ఉన్నారా? చెప్పాలని నిలదీశారు. ఇందులో జరుగుతున్న వందల కోట్ల కుంభకోణాన్ని త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి... ఇప్పుడు కేవలం సన్నబియ్యానికి మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. వడ్ల కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో.. తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉండటం కాదని... కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
Alleti Maheshwar Reddy
BJP
Revanth Reddy
Uttam Kumar Reddy

More Telugu News