eOffice: ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఎన్నికల సంఘం
- ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ సాయంతో కార్యకలాపాలు
- కొత్త వెర్షన్ ను తీసుకువచ్చిన ఎన్ఐసీ
- ఈ నెల 18 నుంచి 25 వరకు అప్ గ్రేడేషన్ షెడ్యూల్ ప్రకటన
- ఈ సమయంలో అప్ గ్రేడేషన్ వద్దంటూ గవర్నర్, సీఈవోలకు చంద్రబాబు లేఖ
- ఎన్ఐసీ ప్రతినిధులతో మాట్లాడిన సీఈవో
ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసేందుకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈ నెల 18 నుంచి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సమయంలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ సరికాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఏపీ గవర్నర్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈ-ఆఫీస్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ సీఈవో మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి స్పష్టం చేశారు. అనంతరం, సాంకేతిక కారణాలతో ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఐసీ వెల్లడించింది.
సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ షెడ్యూల్ ను మరికొన్ని రోజుల తర్వాత విడుదల చేస్తామని ఎన్ఐసీ ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న ఈ-ఆఫీస్ పాత వెర్షన్ తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది.